గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు కొడాలి నాని టార్గెట్ గా విరుచుకుపడ్డారు. 

కొడాలి నాని ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడో ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలో కొడాలి నాని ఎలా ఎమ్మెల్యేగా ఎదిగారో ఆ విషయాలను పదేపదే ప్రస్తావించారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కొడాలి నాని అంటూ ధ్వజమెత్తారు. 

తన దగ్గర పెరిగి తాను సీటిస్తే ఎమ్మెల్యేగా గెలిచి తనపైనే పెద్దపెద్దగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అంటూ కొడాలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నానిని క్షమించడానికి వీలులేదన్నారు. 

ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలైన తర్వాత ఎప్పుడూ కనబడని ఆయన ఎలక్షన్స్ అప్పుడు డబ్బు మూటలతో వస్తాడని ఆ మూటలతో ఓట్లు కొంటాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఇక్కడే ఉంటానని ఇల్లు కూడా కొనుక్కున్నాడని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలతో ఉండే దేవినేని అవినాష్‌ను గెలిపించుకోవాలని ఓటర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.