రావులపాలెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ సైకిల్ చెయిన్ పీకేశాడు అంటూ టీడీపీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కేసీఆర్‌కు ఆ శక్తి ఉందా అని ప్రశ్నించారు. 

సైకిల్ జోరు పెంచితే బుల్లట్‌లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందని వ్యాఖ్యానించారు. సైకిలు వెనక్కి పోతుందా, సైకిల్ సత్తా ఏంటో కేసీఆర్‌కు తెలుసునని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడే కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. 

అలాంటి వాడు సైకిల్ చైన్ పీకేస్తాడా అంటూ నిలదీశారు. సైకిల్ బుల్లెట్‌లా దూసుకుపోతుంది తప్ప వెనక్కిపోదు అన్నారు చంద్రబాబు. అవసరం అయితే అడ్డం వచ్చినోళ్లను తొక్కుకుంటా పోతుంది అంటూ జనసేనాని పవన్ కు కౌంటర్ ఇచ్చారు.