కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విజయనగరంలో జరిగిన రోడ్‌షోలో నిర్వహించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.

రైతుల కోసం రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. తన వద్ద డబ్బు లేకపోయినా అప్పు తెచ్చానన్నారు. విభజన హామీలు కోరితే టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

పోలవరానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవార్డులు ఇస్తే.. ప్రధాని ఆంధ్రాకు వచ్చి మనల్ని తిడుతున్నారని ఎద్దేవా చేశారు.  విశాఖకు జోన్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని కానీ తలను మొండాన్ని వేరు చేసినట్లు ఇచ్చారన్నారు.

ఆదాయం వచ్చే డివిజన్ రాయగడకు వెళ్లిందని.. విజయవాడలో డివిజన్ ఏర్పాటు చేసి ఎవరైనా జోన్ ఇస్తారా అని ప్రశ్నించారు. 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలుకు వెళ్లొచ్చిన జగన్‌కు తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ దొంగలకు మాత్రమే కాపలాదారని ప్రభుత్వ ఆస్తులకు కాపలాదారు కాదన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రేపు జనాన్ని చంపేసి గుండెపోటని చెప్పి రోడ్ల మీద పడేస్తారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే పులివెందుల లాగా వీధికొక రౌడీ, పూటకో రౌడీ తయారవుతారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్ తనకు రిటర్న్‌గిఫ్ట్ ఇవ్వడానికి జగన్‌కు రూ.1000 కోట్లు పంపిస్తున్నారని సీఎం ఆరోపించారు.