జగన్‌కు రాజకీయాలు తెలియవని, దొంగ లెక్కలు రాయడం, అడ్డంగా దొరికిపోవడం మాత్రమే వచ్చన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరంలో గురువారం జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

మైలవరం నియోజకవర్గంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించామన్నారు. ఎవరు బకాయిలు కట్టకుండా, ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నానని తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు సిటీ సెంట్రల్‌లో ఉంటారని సీఎం తెలిపారు.

భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో కలిసి జగన్ 7 లక్షల ఓట్లు తొలగించారని చంద్రబాబు ఆరోపించారు.

తనను ఇబ్బంది పెట్టినట్లే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని సీఎం ఎద్దేవా చేశారు. మోడీని ఎవరు ప్రశ్నిస్తే అక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసిన వ్యక్తి దేవినేని ఉమా అని తెలిపారు. విజయవాడలో కేశినేనిపై పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్‌తోనే మనం వేగలేకపోతుంటే.. మరో నేరస్థుడు ఆయనతో కలిశారని సీఎం ఎద్దేవా చేశారు. జగన్, పీవీపీ సీబీఐ నేరస్థుల్లో భాగస్తులని, వైసీపీ అధినేతకు నేరస్తులు తప్పించి, మంచి వారు దొరకరా అని చంద్రబాబు ప్రశ్నించారు.