ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ... అమరావతిపై భువనేశ్వరికి అంత జాలి ఎందుకంటూ ధ్వజమెత్తారు.

గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే జాలి ఎందుకు కలగలేదన్నారు. తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా జాలి కలగలేదా అని అంబటి ప్రశ్నించారు. భువనేశ్వరికి రైతులపై జాలా... లేక అమరావతి భూములపైనా.. అంటూ ఆయన ఆరోపించారు.

Also Read:తారాస్థాయికి రాజధాని రగడ: రేపటి నుంచి సకల జనుల సమ్మె

రాజధానిలో హత్యలు చేసి వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్లాన్ నడుస్తోందని రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాజధానిని మూడుగా విభజించామని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అంబటి స్పష్టం చేశారు.

నిజమైన రైతులకు జవాబుదారీగా ఉంటామని, బోస్టన్ రిపోర్టు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు శివరామకృష్ణన్ రిపోర్టును పక్కన పెట్టిందని.. సీఆర్డీఏ చట్టం అనంతరం శివరామకృష్ణన్ దానిని తప్పుబట్టిన సంగతిని రాంబాబు గుర్తుచేశారు.

రాజధాని పేరుపై అనేక అక్రమాలు జరిగాయని... తక్కువ రేట్లకు రాజధానిలో భూమలు కొనుగోలు చేశారని రాంబాబు ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ భూములకు బదులు ఇచ్చే ప్లాట్లలో కూడా అవినీతి జరిగిందని.. రాజధాని నూజివీడు దగ్గర అంటూ తప్పుడు సమాచారం పంపారని అంబటి దుయ్యబట్టారు.

Also Read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

అమరావతి ప్రకటనకు ముందు పెద్దఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మొత్తం 4069.95 ఎకరాలు రాజధానిలో కొనుగోలు చేశారని అంబటి తెలిపారు. 800 మంది తెల్లరేషన్ కార్డుదారుల నుంచి భూములు కొన్నారని.. రాజధాని ప్రకటన తర్వాత కూడా కొనుగోలు జరిగిందని రాంబాబు తెలిపారు.

మరో నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అన్నారని, రూ.54 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్యలు ప్రేరేపించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.