రాజధాని తరలింపును నిరసిస్తూ శుక్రవారం నుంచి అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె నిర్వహిస్తామని రాజధాని పరిరక్షణ సమితి తెలిపింది. 29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సకల జనుల సమ్మే చేస్తున్నామని.. ప్రజలంతా సమ్మెలో పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.

ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రైతులే జోలేపట్టి రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరిస్తారని జేఏసీ వెల్లడించింది. రాజధాని నిర్మాణానికి తాము సహకరిస్తామని.. రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి రాజధానిని నిర్మించొచ్చని జేఏసీ పేర్కొంది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వం కార్యాలయాలు పనిచేయకుండా తమకు సహకరించాలని జేఏసీ కోరింది. 

Also Read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

కాగా శుక్రవారం బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు

Also Read:రాజధాని రచ్చ: అమరావతి స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌‌?

రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది