శ్రీకాకుళం: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల గురించి నీతులు మాట్లాడం హాస్యాస్పదంగా ఉందంటూ విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన భూమన చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని అలాంటి వ్యక్తి తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

చంద్రబాబు నాలుక శఖోపశాఖలుగా చీలిపోయిందంటూ భూమన ధ్వజమెత్తారు. అవినీతి అధికారులపై దాడులు చేసే స్వతంత్ర ప్రతిపత్తి గల సీబీఐ వ్యవస్థను నీరుగార్చరని విమర్శించారు. ఏసీబీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని దాడులు చేయించడం ఆయన దుర్బుద్ది అర్థమవుతోందని భూమన విమర్శించారు.