అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడం విషయం అటు ఉంచితే దేశంలో ఏ పార్టీ ఓడిపోయినా దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు లింక్ పెడుతూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ అధికారానికి దూరమయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా దూరమయ్యారనుకోండి. తాజాగా మహారాష్ట్రలో శివసేన కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది కూడా 23వ తేదీ కావడం విశేషం. 

రాత్రికి రాత్రే 'మహా' ట్విస్ట్: సిఎంగా ఫడ్నవీస్ ప్రమాణం, ఎన్సీపిలో చీలిక

చంద్రబాబు నాయుడును కలుసుకోవడం వల్లే శివసేన అధికారాన్ని కోల్పోయిందని వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ తెగ విమర్శిస్తోంది. చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమయ్యారని అలాగే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని చివరికి చంద్రబాబు పుణ్యమా అంటూ శివసేన పార్టీ కూడా 23నే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోలేకపోయిందంటూ సెటైర్లు వేస్తోంది. 

మహారాష్ట్రలో కుదిరిన డీల్: సీఎం కుర్చీ శివసేనదే...అయితే

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని భావించారు. తీరా ఫలితాలు చూసేసరికి సీన్ కాస్త రివర్స్ అయ్యింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ కూటమి అధికారానికి దూరమైందంటూ వైసీపీ సోషల్ మీడియా ఆరోపించింది. 

అంతేకాదు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకుంది అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే గతం కంటే అత్యధిక సీట్లు గెలుచుకుంది బీజేపీ. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎంపీలను కంటే అధికంగానే గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. 

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడమే కారణమని వైసీపీ ఆరోపించింది. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేల పరాభవనాకి చంద్రబాబే పరోక్ష కారణమని ఆరోపిస్తూ సెటైర్లు వేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.