Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలో స్థానచలనాలు ఎస్సీలకేనా? ఇప్పటివరకు ఎంతమందిని మార్చారంటే...

అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు, మంత్రులను మారిస్తే ఫలితం దక్కుతుందా. సోమవారం ఒక మంత్రి సీటు మార్చడంతో మొత్తంగా ఇప్పటివరకు నలుగురు మంత్రుల సీట్లు మార్చినట్లైంది. మరో ముగ్గురు కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం. దీంతో పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లుగా  సమాచారం. 

YSRCP reshuffling more SC and ST MLAs, MPs in andhra pradesh - bsb
Author
First Published Dec 19, 2023, 7:38 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి రెండోసారి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా స్థానచలనం  చేస్తోంది.  ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తల ఏర్పాటుతో.. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెప్పకనే చెప్పింది. మరోవైపు ముగ్గురు మంత్రుల సీట్లు మార్చింది. తాజాగా సోమవారం మరో మంత్రికి కూడా ఇదే జరిగింది. 

సోమవారం నాడు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నంతా జరిగింది. సోమవారం కొంతమందికి స్థానచలనం కలగగా, మరి కొంతమందికి అసలు టికెట్టే దక్కదని తెలిపారు.  ఇద్దరు ఎస్సీ శాసన సభ్యులు, ఒక ఎస్ టి ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ‘టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడద్దని…ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటాం’ అని హామీ ఇచ్చి బుజ్జగించి పంపినట్లుగా సమాచారం.

యువగళం పాదయాత్ర ముగింపు: నాడు జగన్ అలా, నేడు లోకేష్ ఇలా...

సోమవారం నాడు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైసిపి ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.

ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరికి స్థానం లేకుండా చేశారని.. ఆయన 2019లో టిడిపి నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారని  తెలిపారు. మరి తన పరిస్థితి ఏమిటని మాట్లాడినట్లుగా సమాచారం. ఈయన బాటలోనే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పేశానని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొత్త సమన్వయకర్తల ప్రకటనతోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మార్పుల్లో ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఎస్సీలనే  ఎక్కువగా మారుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో ఐదుగురు దళితులు, ముగ్గురు బీసీలు ఉన్నారు. ఇదే కోవలో సోమవారం కలిసిన వారిలో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీ ఎంపీ ఉండబోతున్నట్లుగా సమాచారం. 

 విజయవాడలోనూ మార్పులు ఉండబోతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే  సోమవారం ప్రభుత్వ సలహా గారు సజ్జల రామకృష్ణారెడ్డి  విజయవాడ నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి, పశ్చిమ ఎమ్మెల్యే  వెల్లంపల్లి శ్రీనివాస్ లతో చర్చించారు. వెల్లంపల్లి శ్రీనివాసులు విజయవాడ సెంట్రల్ కు మారుస్తారని వినిపిస్తోంది. వెల్లంపల్లి స్థానంలో ఓ విద్యాసంస్థ యజమాని పేరును పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ సారి 82మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ మార్పులతో పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఏమోగానీ అసంతృప్తిని మాత్రం తీవ్ర స్థాయిలో మూటగట్టుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios