యువగళం పాదయాత్ర ముగింపు: నాడు జగన్ అలా, నేడు లోకేష్ ఇలా...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని పైలాన్ ను ఆవిష్కరించారు లోకేష్.
విశాఖపట్టణం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారంనాడు ముగిసింది. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని ఆగనంపూడి వద్ద పాదయాత్రను నారా లోకేష్ ముగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కూడ వస్తున్నా మీ కోసం పాదయాత్రను ఆగనంపూడి వద్దే ముగించారు. ఈ నెల 11న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఇవాళ విశాఖపట్టణం జిల్లాలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని పైలాన్ ను నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ ఏడాది జనవరి 27న నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగింది. రాష్ట్రంలోని 2028 గ్రామాల మీదుగా లోకేష్ యాత్ర నిర్వహించారు. 228 రోజుల పాటు 3,132 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 30న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని లోకేష్ భావించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తో లోకేష్ పాదయాత్రకు కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2817 కి.మీ పాదయాత్ర నిర్వహించారు. 2012 అక్టోబర్ 2న హిందూపురంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. 2013 ఏప్రిల్ 28న విశాఖపట్టణం జిల్లా ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగించారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 341 రోజుల పాటు 3,648 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను నిర్వహించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించారు.2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జగన్ పాదయాత్రను ముగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇచ్ఛాపురంలోనే పాదయాత్రను ముగించారు.
also read:మూడు వేల కి.మీ. చేరిన లోకేష్ పాదయాత్ర: ఇక టార్గెట్ జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 68 రోజుల పాటు 1475 కి.మీ. పాదయాత్ర నిర్వహించాడు. 2003 ఏప్రిల్ 9న చేవేళ్లలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. 2003 జూన్ 15న ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగించిన చోటే జగన్ పాదయాత్రను ముగించారు. చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారు.
దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
— Telugu Desam Party (@JaiTDP) December 18, 2023
గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.
అభిమానుల జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.
కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.
జై తెలుగుదేశం, జయహో… pic.twitter.com/oILmpYYkpc