పంచాయతీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన జోష్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీనిలో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల జాబితాను వైసీపీ శుక్రవారం విడుదల చేసింది.

అనకాపల్లి, భీమిలి, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని 44 మంది అభ్యర్ధిత్వాలను అధిష్టానం ఖరారు చేసింది. అనకాపల్లి 5, భీమిలి 8, ఉత్తర నియోజకవర్గం 17, పశ్చిమ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులను ప్రకటించింది అధికార పార్టీ. 

మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు కుదుర్చుకున్నాయి. టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

సీపీఐ, సీపీఎంలు రెండేసి స్థానాలకు పోటీ చేస్తాయి. మిగతా స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుంది. జీవీఎంసిలో మొత్తం 98 వార్డులున్నాయి. ఈ 98 వార్డులకు కూడా మూడు పార్టీల కూటమి పోటీ చేయనుంది. టీడీపీ తన పార్టీ అభ్యర్థులను రేపు శనివారం ప్రకటించనుంది. 

జీవీఎంసీలో గతంలో 81 వార్డులుండగా వాటిని 98కి పెంచారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 8 జోన్లు ఉన్నాయి. మధురవాడ, అసిల్ మెట్ట, సూర్యబాగ్, జ్ఞానాపురం, గాజువాక, వేపగుంట, భిమిలీ, అనకాపల్లి జోన్లు ఉన్నాయి. జీవీఎంసి ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేయనున్నాయి.