న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు.  

ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటుటూనే ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు అంటూ నిలదీశారు. 

రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే ప్రజలు నమ్మేస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా అని చంద్రబాబును నిలదీశారు.

ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని.. అందాకా కాస్త ఓపిక పట్టాలని చంద్రబాబు నాయుడుకు విజయసాయిరెడ్డి హితవు పలికారు.