అమరావతి : టీవీ 9 మాజీ సిఈవో లగడపాటి రాజగోపాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపించారు. 

రవిప్రకాశ్ వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారటంటూ ట్వీట్ చేశారు. జిల్లాకో ఏజెంటును పెట్టి ఆసుపత్రులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రైస్ మిల్లర్లు, కార్పోరేట్‌ కాలేజీలను బ్లాక్‌మెయిల్ చేసిన ఆధారాలు బయటకు వస్తున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

అన్నిదారులు మూసుకుపోవడంతో రవిప్రకాశ్ చంద్రబాబుపై పడ్డారని విమర్శించారు. ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’ అంటూ ట్వీట్ చేశారు. 

ఈనెల 23 తర్వాత తన పరిస్థితే ఏమవుతుందో అంతుబట్టక సతమతమవుతుంటే శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్దన్ చౌదరిల బెదిరింపులతో కుంగిపోతున్నాడట. ఇంత ఈజీగా దొరికి పోయారేంటని మొత్తుకుంటున్నాడట. 

చంద్రబాబు ఆయన కుల మీడియా పార్ట్‌నర్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే నమ్మిన వాళ్లను తడిగుడ్డతో గొంతులు కోయడంలో వాళ్ళ నైపుణ్యం ఏమిటో తెలిసిపోతోంది. గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుంది. బయట పడకపోతే తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా చెరబట్టే వారే' అని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో నిప్పులు చెరిగారు.