హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ దాదాపు రూ.20వేల కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఎన్నికల్లో ఎంతఖర్చుపెట్టినా ప్రజలు మాత్రం కర్రుకాల్చి వాతపెట్టారని చెప్పుకొచ్చారు. 

ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలేనని చెప్పుకొచ్చారు. వెన్నుపోటు తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల్లో రూ.500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబు నాయుడుది అని ఆరోపించారు. 

మరోవైపు గుంటనక్కలు ఇకపై శాకాహారమే తింటామని శపథం చేసినట్టే చంద్రబాబు తీరు, పార్టీ వ్యవహారం ఉందని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఎన్నికల వ్యవస్థను నాశనం పట్టించిన టీడీపీ నేతలు ఓటర్లు తెలివిమీరారని దుయ్యబడుతున్నారని మండిపడ్డారు. మద్యం ఏరులై పారించింది మీరే కదా? బ్యాంకుల నుంచి 2 వేల నోట్లు మాయం చేసింది ఎవరు అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.