చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. విద్యార్ధి దశ నుంచే నేర ప్రవృత్తి, రామోజీపైనా దర్యాప్తు జరగాలి : విజయసాయిరెడ్డి
విద్యార్ధి స్థాయి నుంచే చంద్రబాబుది నేర ప్రవృత్తి అని.. రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి . అన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారని.. నిజాయితీపరుడైతే విచారణ ఎదుర్కోవాలని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు .

టీడీపీ బంద్‌లో హెరిటేజ్ షాపులు కూడా మూయలేదన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్ధితి లేదన్నారు. చంద్రబాబు సహజంగానే నేర స్వభావం కలిగిన వ్యక్తని విజయసాయిరెడ్డి ఆరోపించారు. విద్యార్ధి స్థాయి నుంచే చంద్రబాబుది నేర ప్రవృత్తి అని.. రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
చంద్రబాబుకు ఏమాత్రం ప్రజాభిమానం లేదని.. ఆయన చేయని అరాచకాలు లేవని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అమరావతి, పోలవరం సహా అనేక స్కామ్‌లు చేశారని.. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారని.. నిజాయితీపరుడైతే విచారణ ఎదుర్కోవాలని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో దాదాపు రూ.370 కోట్లు కొట్టేశారని.. ఒక్క రూపాయి కూడా తమకు ముట్టలేదని సీమెన్స్ చెబుతోందన్నారు.
Also Read : ఇక చంద్రబాబు లోపలే.. నెక్ట్స్ లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు రెడీ వుండాలి : రోజా సంచలన వ్యాఖ్యలు
ఈ కుంభకోణం చేసిందంతా కేవలం చంద్రబాబేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల విచారణలో ఈ విషయం బయటపడిందని.. కేంద్ర సంస్థలు అదే విషయం తెలిపాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు స్కాంలో రామోజీరావు పాత్రపై విచారణ జరగాలని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీలో వున్న పురందేశ్వరి టీడీపీ కోవర్ట్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.