ఇక చంద్రబాబు లోపలే.. నెక్ట్స్ లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు రెడీ వుండాలి : రోజా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా త్వరలో లోపలికి వెళ్లడానికి సిద్ధంగా వుండాలంటూ రోజా వ్యాఖ్యానించారు . చంద్రబాబుది అక్రమ కేసు కాదని.. అడ్డంగా దొరికిపోయిన కేసు అని రోజా దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. మంగళవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన చంద్రబాబుకు శిక్షపడాలని అంతా కోరుకున్నారని రోజా పేర్కొన్నారు. ఆయనకు శిక్షపడటంతో మొక్కులు చెల్లించుకున్నానని మంత్రి వెల్లడించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భారీ భద్రత కల్పించామని రోజా పేర్కొన్నారు. నారా లోకేష్ గగ్గోలు పెడుతున్న తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి సెటైర్లు వేశారు.
చంద్రబాబుది అక్రమ కేసు కాదని.. అడ్డంగా దొరికిపోయిన కేసు అని రోజా దుయ్యబట్టారు. లోపలికి వెళ్లిన చంద్రబాబు అక్కడే వుంటాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా త్వరలో లోపలికి వెళ్లడానికి సిద్ధంగా వుండాలంటూ రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ బంద్ పిలుపు ఇస్తే.. భువనేశ్వరి, బ్రాహ్మణిలు హెరిటేజ్‌ను ఓపెన్ చేశారని మంత్రి దుయ్యబట్టారు. అమరావతి భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్, పట్టిసీమ, పోలవరం కేసులు సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వస్తాయని రోజా హెచ్చరించారు. చేసిన తప్పులకు చంద్రబాబు ఇప్పుడు శిక్ష అనుభవించకతప్పదని.. ఇంతకాలం కోర్టులను మేనేజ్ చేస్తూ గడిపేశారని ఆమె విమర్శించారు.
Also Read: రాజమండ్రి జైలులో మావోయిస్టులు ఉన్నా చంద్రబాబుకు ఇబ్బంది లేదు.. హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు
అంతకుముందు మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకున్నాడని, చివరికి జైలు పాలయ్యాడని అన్నారు. దొంగతనం చేసి చట్టానికి దొరికాడని పేర్కొన్నారు. చట్టాలేమీ ఆయనకు చుట్టాలు కాదని కామెంట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చంద్రబాబు మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయం అని అన్నారు. ఆయన జీవితమంతా అవినీతి మయమే అని తెలిపారు. అన్ని కేసుల్లో చంద్రబాబే ముద్దాయి అని వివరించారు. అదే విధంగా నారా లోకేశ్ కూడా త్వరలో ముద్దాయి కాబోతున్నాడని అన్నారు. ఆయన కూడా జైలుకు వెళ్లుతారని జోస్యం చెప్పారు. అందుకే ఇకనైనా చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు.
నారా లోకేశ్ బూతులు మానుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. తాము కూడా బూతులు మాట్లాడితే తట్టుకోలేరని కామెంట్ చేశారు. పేదలకు సీఎం జగన్ పారదర్శకంగా సేవలు అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారని ఆరోపించారు. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకుని ఎడాపెడా ఆరోపణలు చేశారని విమర్శించారు. అన్ని కేసుల్లో చంద్రబాబు ముుద్దాయి అని మంత్రి వివరించారు. అంతేకానీ, తమకు చంద్రబాబు మీద కక్ష లేదని స్పష్టం చేశారు. కక్షే ఉంటే అధికారంలోకి వచ్చాకే అరెస్టు చేయించేవారమని కానీ, ఇప్పుడు ఆయన చేసిన పాపాలకు ఆయనే శిక్ష అనుభవిస్తున్నారని కామెంట్ చేశారు. కోర్టుల్లో ముద్దాయిగా నిలబడక తప్పదని అన్నారు.