వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. బషీర్ బాగ్ కాల్పులకు నేటితో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఆనాటి దమనకాండపై చంద్రబాబుకు చురకలంటించారు. 

"విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు." అని ఆయన రాసుకొచ్చారు. 

ఇక బషీర్ బాగ్ ఘటన విషయానికి వస్తే... సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది. పోలీసు కాల్పులతో దద్ధరిల్లింది. అప్పుడు చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. విద్చుచ్చక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది. తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు తెలిపింది. 

ప్రపంచబ్యాంక్‌ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్‌ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్‌ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి.