అమరావతి : టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీలపై సెటైర్లు వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రవిప్రకాశ్, శివాజీలు అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తలపై ట్విట్టర్ వేదికగా పంచ్ లు వేశారు. 

ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ సెటైర్‌ వేశారు విజయసాయిరెడ్డి.  మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్‌లో వైట్‌ బోర్డు, మార్కర్‌ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట అంటూ సెటైర్లు వేశారు. 

 

అంతేకాదు సైరా పంచ్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ పెట్టారు. మరోవైపు తనకు కులం లేదు, మతం లేదంటూనే సొంత సామాజిక వర్గానికే ప్రమోషన్లలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మరో సైరా పంచ్‌ వేశారు విజయసాయిరెడ్డి. 

 

తాను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు, ఎగ్జిట్ పోల్స్ ను మాత్రం నమ్మెద్దని చెప్పడం వింతగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు కానీ మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మెచ్చో దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసునని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 


చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. 

గవర్నర్ నరసింహన్‌ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయొద్దని చంద్రబాబుకు సూచించారు. 

ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటీఏమ్‌లా మార్చుకుని వేల కోట్లు మింగారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.