న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు. 

శుక్రవారం నాడు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమైన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.రఘురామకృష్ణంరాజు నైతిక విలువలను కోల్పోయారని ఆయన ఆరోపించారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డాడరని విజయసాయిరెడ్డి చెప్పారు. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

also read:రఘురామకృష్ణంరాజుపై అనర్హత: స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు

ప్రతి ఎంపీతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ నియామవళికి విరుద్దంగా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజుకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఏవో లాభాలు ఆశించి ఇతర పార్టీలకు రఘురామకృష్ణంరాజు దగ్గరయ్యారని విజయసాయిరెడ్డి తెలిపారు.  బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని ఆయన చెప్పారు. రఘురామకృష్ణంరాజు ఉపయోగించిన భాషను కూడ ఎవరూ కూడ హర్షించరని విజయసాయిరెడ్డి చెప్పారు.రఘురామకృష్ణంరాజు మనసు, మనిషి తమ పార్టీపై లేదన్నారు.

పార్టీలో సీనియర్లను కాదని రఘురామకృష్ణంరాజుకు పార్లమెంటరీ పార్టీ స్టాండింగ్ కమిటి ఛైర్మెన్ ను కట్టబెట్టారని పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ పక్ష నేత మిథున్ రెడ్డి చెప్పారు.టీడీపీ, టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతల ప్రోద్బలంతో తమ పార్టీపై విమర్శలు గుప్పించారన్నారు.రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరు తమకు బాధ కల్గించిందన్నారు.