న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాకు  ఫిర్యాదు చేశారు.

ఇవాళ ప్రత్యేక విమానంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్, మిథున్ రెడ్డి, బాలశౌరిలు స్పీకర్ ను కలిశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. 

also read:వైఎస్ జగన్ ప్లాన్: హైకోర్టులో రఘురామకృష్ణమ రాజు పిటిషన్

పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని గత నెల 22వ తేదీన ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణంరాజు సాంకేతిక అంశాలను ప్రస్తావించారు..

గత నెల 29వ తేదీన ఏపీ సీఎం జగన్ కు రఘురామకృష్ణంరాజు ఆరు పేజీల లేఖను రాశాడు. షోకాజ్ కు సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైసీపీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇవాళ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వంద పేజీలతో స్పీకర్ కు రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు చేసింది. 

మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా  రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాాలో వచ్చిన వార్తల క్లిప్పింగులను కూడ ఈ ఫిర్యాదుతో జత చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో  వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు.