ఎన్డీయే మీటింగ్కు టీడీపీకి దక్కని ఆహ్వానం .. అయ్యో పాపం, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
బెంగళూరులో జరుగుతున్న ఎన్‌డీఏ పక్షాల సమావేశానిక టీడీపీకి ఆహ్వానం అందకపోవడంపై చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో కుమిలిపోతున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, మోడీని గద్దె దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పాట్నా, బెంగళూరులలో విపక్షాలు సమావేశమై కార్యాచరణపై చర్చించాయి. మోడీకి ధీటైన నేతను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అంతా బాగానే వుంది కానీ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి సంగతి పక్కన బెడితే.. ఈ కూటమి పేరెంటి అంటూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
అయితే వీటిలో ఏ ఒక్క దానికి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందలేదు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చంద్రబాబు నాయుడుకు కనీసం ఎన్డీయే కూటమికి కూడా ఆహ్వానం రాలేదు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ అయ్యో పాపం! ఎన్ని లాబీయింగులు చేసినా ఎన్డీయే కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం రాలేదు. బిజెపిలోకి పంపించిన కోవర్టులు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో కుమిలిపోతున్నాడు బాబుగారు. అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు.’’ అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
అంతేకాకుండా.. ‘‘ జగన్ గారి నాలుగేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నిధులు పక్కదోవ పట్టిన ఉదంతం లేదు. రైతులు ఎన్నడూ లేనంత ధీమాగా, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, ఆసరాలేని వారంతా ఇటువంటి సిఎం ఎప్పటికీ ఉండాలని గుండె నిబ్బరంతో ఉన్నారు. ‘స్పేస్’ లేకున్నా ఏదో ఒకటి కెలకాలనే టీడీపీ వారు వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.
‘‘ ప్రతిపక్షం ప్రజల కోసం, ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఉద్యమిస్తాయి. నిబద్ధతతో నిలబడే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారు. ఆంధ్ర టీడీపీలో మాత్రం విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక విఫలనేత కోసం అంతా పోగవుతారు. ఆయన ఊ అనగానే ఉత్తుత్తి ఉద్యమాలు, హాస్యాస్పద ప్రదర్శనలు జరుగుతుంటాయి’’. అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.