నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి ఆయనే : తేల్చేసిన విజయసాయిరెడ్డి .. కారణమిదేనా..?
నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో వుంటారని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు . అలాగే నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో కోలాహలం నెలకొంది. ఆశావహులు టికెట్ కోసం ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. అధికార వైసీపీలో కొందరు నేతలు ప్రచారానికి దూరంగా వున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీగా దూరంగా వుంటారనే టాక్ వినిపించింది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో వుంటారని శుక్రవారం తెలిపారు. అలాగే నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో నెల్లూరు రాజకీయాలు సెట్ అయినట్లేనని భావిస్తున్నారు.
Also Read: వందల కోట్లు కాజేశారు.. నారాయణ అక్రమాస్తులన్నీ త్వరలోనే బయటపడతాయి.. : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరులో ఈ పరిస్ధితికి వైసీపీలో గ్రూపులే ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు అనిల్ కుమార్ యాదవ్‌కు అన్నీ తానై అండగా నిలిచారు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. అయితే రూప్ కుమార్ వేరు కుంపటి పెట్టడం.. అనిల్‌పై నేరుగా విమర్శలు దిగడంతో వైసీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఈ పంచాయతీ అధిష్టానం వరకు చేరడంతో ఇద్దరికి రాజీ కుదార్చారు పెద్దలు.
అయినప్పటికీ వివాదానికి తెర పడలేదని, ఈసారి అనిల్ పోటీ చేసినా రూప్ కుమార్ సహకరించరనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం అనిల్‌కే టికెట్ అని స్పష్టం చేసింది. అంగ బలం, అర్ధ బలం వున్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను నెల్లూరు సిటీలో ఢీకొట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్‌కే సాధ్యమని వైసీపీ పెద్దలు భావించారు. అందుకే విజయసాయిరెడ్డి నోటి వెంట ఆ మాటలు వచ్చాయని అంటున్నారు.