తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే తాము దూరం చేసుకునే  ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్షలు వేయడాన్ని తాము సమర్థిస్తామన్నారు.

టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన తప్పులను వెలికి తీస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జైళ్లు సరిపోవని విజయసాయి ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ఫైరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Also Read:వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ రమేష్ కుమార్: జగన్ ప్రభుత్వంపై ఆ తర్వాతే...

సాధారణంగా ప్రభుత్వోద్యోగుల నియమాకాలు రాష్ట్రపతి, గవర్నర్ పేరిట జరుగుతాయని కానీ తనను తాను నియామకం చేసుకోవడం మాత్రం బహుశా నిమ్మగడ్డకే చెందిందని ఆయన సెటైర్లు వేశారు.

ఇలాంటి వ్యక్తుల బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీదా ఉందని విజయసాయి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చిందని ఆయన తెలిపారు.

వైసీపీ కార్యకర్తలకు న్యాయం, చట్టం మీద అపారమైన గౌరవం వుందని విజయసాయి స్పష్టం చేశారు. న్యాయస్థానాలను గౌరవిస్తున్నాం కాబట్టే.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినా, 16 నెలలు జైలులో పెట్టినా తాము శాంతియుతంగానే పోరాడామని ఆయన గుర్తుచేశారు.

Also Read:రేపే డిల్లీకి ఏపి సీఎం జగన్... అమిత్ షాతో సమావేశమయ్యేందుకేనా..?

పదేళ్ల వైసీపీ ప్రస్థానంలో తాము గాంధేయ మార్గంలోనే నడుస్తున్నామని.. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పాల్పడతారో వారిపై కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం జైళ్లకు పంపిందని విజయసాయి రెడ్డి చెప్పారు.

కొంతమంది టీడీపీ కార్యకర్తలు తన పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తన పేరుతోనే జగన్‌ను దూషించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయినా, కాకపోయినా కోర్టుల్లో వారికి తాను అండగా ఉంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.