అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ పర్యటన ఖరారయ్యింది. ఆయన  రేపు(మంగళవారం) డిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి జగన్ ఈ డిల్లీ పర్యటన చేపడుతున్నట్లు సమాచారం.   

కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించడంతో గత రెండున్నర నెలలుగా సీఎం జగన్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. అయితే ఇటీవలే లాక్ డౌన్ ను సడలించారు. ఈ క్రమంలోనే వివిధ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు సీఎం డిల్లీకి వెళుతున్నారు. 

read more  ఏపీ సచివాలయాన్ని తాకిన కరోనా: ఒక్క రోజులో 76 పాజిటివ్ కేసులు

లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలు కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. అంతేకాకుండా కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్ర ప్రజలను ఆదుకోడానికి ప్రభుత్వం భారీ నిధులు ఖర్చుచేయాల్సి వచ్చింది. వీటన్నింటిని కేంద్ర మంత్రులకు వివరించి ఏపికి మరింత సాయం అందించాలని సీఎం కోరే అవకాశాలున్నారు. 

ఇక లాక్ డౌన్ సడలింపు, కరోనా నియంత్రణ తదితర అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేంద్ర  మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల అమిత్ షా సీఎం జగన్ కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనతో మరోసారి చర్చించేందుకు జగన్ డిల్లీకి వెళుతున్నారు.