అమరావతి: తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టే విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా వెంటనే నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే తాను ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టినట్లు రమేష్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ను ఉపసంహరించకుున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. 

ఆ స్థితిలో రమేష్ కుమార్ పదవిపై మరోసారి సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవిలో నియమించే విషయాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో రమేష్ కుమార్ ఏం చేయాలనే విషయంపై ఆలోచన సాగించారు. 

తనను ఎస్ఈసీగా నియమించకపోతే కోర్టు ధిక్కరణ కింద మళ్లీ హైకోర్టుకు వెళ్లడానికి ఆయనకు అవకాశం ఉంది. అయితే, ఆయన వేచి చూసే ధోరణిని అనుసరించాలని భావిస్తున్నారు. కోర్టు సెలవుల తర్వాత కార్యాచరణకు దిగాలని అనుకుంటున్నారు. హైకోర్టుకు 12 రోజుల వేసవి సెలవులు ప్రకటించారు. 

ఈలోగా తనను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోతే సెలవుల తర్వాత కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించకపోవడాన్ని ప్రతిపక్షాలన్నీ తప్పు పడుతున్నాయి. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 


ఎస్ఈసిగా బాధ్యతలు స్వీకరించినట్లు రమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చే వరకు సర్క్యులర్ ఉపసంహరణ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను ఎస్ఈసిగా పదవీ బాధ్యతలు చేపట్టనట్లు ప్రకటించారు. అది చెల్లదని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ప్రకటించడం విశేషం.

ఇదిలావుంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ శనివారం రాత్రి మీడియా ముందుకు వచ్చారు. ఎస్ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై వివరణ అందిందని ఆయన చెప్పారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుకు సంబంధించిన హైకోర్టు తీర్పు కాపీ ఇవాళ అందిందని, నిన్న (శుక్రవారం)మధ్యాహ్నం 3.30 గంటలకు నిమ్మగడ్డ సర్క్యులర్ జారీ చేశారని ఆయన చెప్పారు. తాను బాధ్యతలు చేపట్టినట్లు వివిధ శాఖల అధికారులకు సర్క్యులర్ పంపించారని చెప్పాుర. తీర్పు ఉదయం 11.30 గంటలకు వస్తే మధ్యాహ్నం 3.30 గంటలకు సర్క్యులర్ ఇచ్చారని ఆయన చెప్పారు.

నిమ్మగడ్డ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకుంటూ ఎన్నికల కమిషన్ కార్యదదర్శి ప్రకటన చేశారు. ఎస్ఈసీగా రెస్టోర్ అయ్యానంటూ రమేష్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారని, రమేష్ హైదరాబాదులో ఉండి విజయవాడ ఆఫీస్ అడ్రస్ తో సర్క్యులర్ ఇచ్చారని ఆయన చెప్పారు. నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించినట్లుగా అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీ చేయాలని ఎస్ఈసీ కార్యాలయానికి సూచించారని చెప్పారు. 

ఎస్ఈసీ వాహనాలను వెంటనే హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్ పంపించాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. సత్వరమే ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు నిమ్మగడ్డకు చెప్పలేదని ఆయన చెప్పారు. నిమ్మగడ్డను వెంటనే ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఆదేశించిందే తప్ప తనంత తాను నిమ్మగడ్డ పదవీ బాధ్యతలు చేపట్టాలని చెప్పలేదని ఆయన అన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో స్టే అప్లికేషన్ వేశామని, అదే విషయాన్ని తాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫు న్యాయవాదికి చెప్పామని శ్రీరాం చెప్పారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటుంది కాబట్టి స్టే ఇవ్వాలని కోరామని ఆయన చెప్పారు. అయినా, రమేష్ కుమార్ ను తిరిగి నియమించే విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించడానికి రెండు నెలల సమయం ఉంటుందని ఆయన చెప్పారు.