న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. 

లోక్ సభలో కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన బడ్జెట్ జాతీయ స్థాయిలో మంచి బడ్జెట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి మాత్రం అన్యాయం చేశారన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనే అంశంపై డిటైల్డ్ గా అధ్యయనం చేసి స్పందిస్తామన్నారు. 

మా డిమాండ్లను బడ్జెట్ డిస్కషన్ లో పొందుపరిచేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. మరోవైపు తెలుగింటి కోడలు అయి ఉండి తెలుగులో లోక్ సభలో ఒక్కమాట కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడలేకపోయారని ఆయన విమర్శించారు. 

లోక్ సభలో బడ్జెట్ ప్రశేపెట్టిన సమయంలో ఆమె అన్ని భాషలు మాట్లాడారని కానీ తెలుగు గురించి ఒక్కముక్క కూడా మాట్లాడలేదన్నారు. తెలుగుమాట్లాడి ఉంటే సంతోషించే వాడిననన్నారు. అలాగని కన్నడలో కూడా ఆమె ఏమీ మాట్లాడలేదని అయితే బసవేశ్వరావు గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. 

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో తాను నిర్మలా సీతారామన్ కు శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. తమ జిల్లా కోడలు అని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పానన్నారు. అయితే తెలుగింటి కోడలు అయి ఉండి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఎంపీ రఘురామకృష్ణం రాజు వాపోయారు.