ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. పవన్ టీ తాగే గ్లాస్ తెచ్చుకుంటే .. టీ చంద్రబాబు పోశారని సురేష్ సెటైర్లు వేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి కానీ పవన్ ఎందుకు అలా చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. క్లార్ వార్ గురించి మాట్లాడే పవన్ ఏ క్లాస్ నుంచి ప్యాకేజ్ అందుకున్నారని నందిగం సురేష్ ప్రశ్నించారు. అలాగే పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది.. ఎవరు ఖర్చు పెట్టారని ఆయన నిలదీశారు. పవన్ టీ తాగే గ్లాస్ తెచ్చుకుంటే .. టీ చంద్రబాబు పోశారని సురేష్ సెటైర్లు వేశారు.
చంద్రబాబుకి బానిసత్వం చేయటంతో ఆయనకు అలసట రావడం లేదన్నారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని సురేష్ మండిపడ్డారు. తాను మాత్రమే సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా పవన్ తీరు వుందని.. ఆయన మాత్రం అందరినీ విమర్శిసాడట అంటూ దుయ్యబట్టారు. విమర్శలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పాలని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ మరోసారి అంతా ఏకమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఏకమైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయేనని నందిగం సురేష్ స్పష్టం చేశారు.
ఇకపోతే.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. పదే పదే తన వ్యక్తిగత జీవితంపై మాటలేంటని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రతి చిన్న విషయం తనకు తెలుసునని కానీ.. తన సంస్కారం చిల్లరగా మాట్లాడనివ్వదన్నారు. హైదరాబాద్‌లో జగన్ ఏం చేశాడో తనకు తెలుసునని పవన్ చెప్పారు. మీ నాయకులు ఎవరినైనా పంపితే.. చెబుతానని, అది వింటే నీ చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త అంటూ జనసేనాని హెచ్చరించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే.. చూస్తూ ఊరుకోనని పవన్ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జనసైనికులు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గందని, వైసీపీ నేతలు కూడా వాళ్ల నోటికి సైలెన్సర్లు తగ్గిస్తే తమ వాళ్లు కూడా పూర్తిగా తగ్గిస్తారని పవన్ దుయ్యబట్టారు.
కులం పేరు తీసేసి.. తర్వాత క్లాస్ వార్ గురించి మాట్లాడాలని జగన్‌కు చురలంటించారు. కొండపల్లి సీతారామయ్యలా, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డిలా జగన్ మాట్లాడుతూ వుంటారని ఎద్దేవా చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి అని కానీ ఆయన తన పేరు చివరన వున్న తోక తీసేసి పేదల కోసం పనిచేశారని ప్రశంసించారు. జగన్ సీఎం అయిన నెల రోజులకే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని, 32 మంది ఆకలి చావులతో ఉరి వేసుకుని చనిపోయారని పవన్ దుయ్యబట్టారు.
