రామచంద్రాపురం వైసీపీలో పంచాయితీ: తోట త్రిమూర్తులుతో ఎంపీ మిథున్ రెడ్డి భేటీ
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు.
కాకినాడ: వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో ఆ పార్టీ రీజినల్ కోఆర్ఢినేటర్ మిథున్ రెడ్డి సోమవారంనాడు భేటీ అయ్యారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు వైఎస్ఆర్‌సీపీ టికెట్టు ఇస్తే తాను మద్దతివ్వబోనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. అవసరమైతే పార్టీని కూడ వీడుతానని ఆయన ప్రకటించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ప్రకటన చేసిన మరునాడే తోట త్రిమూర్తులుతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రామచంద్రాపురం నియోజకవర్గ పరిణామాలపై చర్చించారు. మంత్రి చెల్లుబోయిన వేణుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ , తాను ఈ నియోజకవర్గంలో గతంలో చేరో పార్టీలో ఉంటూ పోటీ చేసినా కూడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏనాడూ లేవని త్రిమూర్తులు మిథున్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిణామాలపై త్రిమూర్తులు, మిథున్ రెడ్డిలు రెండు గంటల పాటు చర్చించారు. త్వరలోనే సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించనున్నట్టుగా తోట త్రిమూర్తులుకు మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు.
రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి గతంలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో కొనసాగారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు . 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తోట త్రిమూర్తులు టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో తోట త్రిమూర్తులును వైఎస్ఆర్‌సీపీ మండపేట ఇంచార్జీగా జగన్ నియమించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తొలుత ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపారు.
also read:ఆయనతో ఉన్నవారే చెడ్డపేరు తెస్తున్నారు: పిల్లి సుభాష్ పై మంత్రి వేణు
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణు పోటీ చేస్తారని ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేణుకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇస్తే అవసరమైతే పార్టీని వీడుతానని కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పడం వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపుతుంది.