ఆయనతో ఉన్నవారే చెడ్డపేరు తెస్తున్నారు: పిల్లి సుభాష్ పై మంత్రి వేణు
గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పదవులు కట్టబెట్టిందని మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు.
కాకినాడ: రామచంద్రపురం అసెంబ్లీ స్థానం నుండి తాను పోటీ చేస్తానని తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ముందే సీఎం చెప్పాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రకటించారు.
మంత్రిగా చెల్లుబోయిన వేణు బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆదివారంనాడు రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన ఆయన వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సమ్మేళనంలో మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు.ఈ సమావేశంలోనూ, సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రాపురం నుండి తనకే టికెట్టు అనే విషయాన్ని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించే వారిని దూరం పెడతానని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసిన విషయాన్ని మంత్రి పిల్లి వేణు ప్రస్తావించారు.
పిల్లి సుభాష్ తో ఉన్నవాళ్లే ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయం శిరోధార్యంగా ఆయన చెప్పారు. పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తుందన్నారు.గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పార్టీ పదవులు కట్టబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:క్యాడర్ ను వదులుకోను, అవసరమైతే పార్టీని వీడుతా: పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలనం
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 16న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు సమావేశమయ్యారు. ఇవాళ మంత్రి వేణు వర్గీయులు ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. మంత్రి వేణు తన వర్గానికి చెందిన క్యాడర్ పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి వేణు ఖండిస్తున్నారు.