Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. పక్కా ఆధారాలతోనే ఆ నలుగురిపై సస్పెన్షన్ : ఎంపీ మిథున్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలను పక్కా ఆధారాలతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చంద్రబాబు క్యారెక్టర్ లేని మనిషిని.. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్‌ను దించేశారని ఆయన ఆరోపించారు. 

ysrcp mp mithun reddy comments on ycp mlas suspension
Author
First Published Mar 26, 2023, 7:41 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించారు వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి . ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కా ఆధారాలతోనే సస్పెండ్ చేసిందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో వైసీపీని వీడిన 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని మనిషిని.. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్‌ను దించేశారని మిథున్ రెడ్డి ఆరోపించారు. సీటు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారని.. కానీ జగన్ మాత్రం కరాఖండీగా చెప్పేశారని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు వుందా అని మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. వైనాట్ 175 లక్ష్యంతోనే తాము పనిచేస్తామన్నారు. 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాజకీయాలను చంద్రబాబు వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని, మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఆయన పద్ధతి ఇదేనంటూ మోపిదేవి దుయ్యబట్టారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ సీఎం అవుతారని వెంకట రమణ జోస్యం చెప్పారు. 

అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ 10 మంది కోసం ప్రయత్నిస్తే నలుగురు వచ్చారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ మరిన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ నలుగురితో పాటు తన ఓటు కోసం కూడా టీడీపీ ప్రయత్నించిందని రాపాక వరప్రసాద్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయాన్ని ముమ్ముడివరం ఎమ్మెల్సీ సతీష్‌తో పాటు మరో మంత్రికి చెప్పినట్లు తెలిపారు . అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే తనతో మాట్లాడారో లేదో సీసీ కెమెరాల్లో చెక్ చేయించాలని రాపాక సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు తనను సంప్రదించారని ఆయన తెలిపారు. 

ALso REad: అమ్ముడుపోయారు అన్నాం కానీ, పేర్లు చెప్పలేదుగా.. భుజాలెందుకు తడుముకుంటారు : మంత్రి కాకాణి

ఎమ్మెల్యేలను కొనకుండానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు పడ్డాయా అని వరప్రసాద్ ప్రశ్నించారు. మెజారిటీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని.. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని రాపాక ఆరోపించారు. టీడీపీ వాళ్లు ప్రలోభ పెట్టకుండానే వాళ్లు ఎలా ఓట్లు వేస్తారని ఆయన నిలదీశారు. తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని.. టీడీపీకి 19 మంది మాత్రమే వుంటే 23 ఓట్లు ఎలా వచ్చాయని రాపాక ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు కొనడం కొత్త కాదని.. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికింది టీడీపీ కాదా అని ఆయన నిలదీశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు హస్తం లేదా అని వరప్రసాద్ ప్రశ్నించారు. వీడియోను వైరల్ చేసి ఎవరి మెప్పు పొందాల్సిన అవసరం తనకు లేదని రాపాక పేర్కొన్నారు. తాను వైసీపీకి డైరెక్ట్‌గా సపోర్ట్ చేసి గడప గడపకు తిరుగుతున్నానని వరప్రసాద్ అన్నారు. 

మరోవైపు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. టీడీపీ పది కోట్లు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. తన ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని.. తన దగ్గర డబ్బు ఎక్కువై వద్దనలేదన్నారు. నా ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. తెలుగుదేశానికి ఓటేస్తే మంచి పొజిషన్ వుంటుందని చెప్పారని రాపాక అన్నారు. జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని.. సిగ్గు శరం వదిలేస్తే తనకు పదికోట్లు వచ్చి వుండేవని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమని ఆయన పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios