ఎన్టీఆర్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు చూపేదంతా కపట ప్రేమేనన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు మాటలను రజనీకాంత్ నమ్మొద్దని ఎంపీ కోరారు. చంద్రబాబుకు సొంత కొడుకు మీద నమ్మకం లేక అద్దె కొడుకుని తెచ్చుకున్నారని భరత్ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబును ప్రశంసిస్తూ తలైవా చేసిన ప్రసంగంపై వారు మండిపడుతున్నారు. తాజాగా రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌పై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని .. కానీ అదంతా కపట ప్రేమని దుయ్యబట్టారు . ఎందరినో ప్రధానులను చేశానని.. మరెందరికో భారతరత్న ఇప్పించానని చెప్పుకునే చంద్రబాబు మరి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని మార్గాని భరత్ ప్రశ్నించారు.
చంద్రబాబు మాటలను రజనీకాంత్ నమ్మొద్దని ఎంపీ కోరారు. చంద్రబాబుకు సొంత కొడుకు మీద నమ్మకం లేక అద్దె కొడుకుని తెచ్చుకున్నారని భరత్ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ నేతలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనపై ఛార్జ్‌షీట్ పేరుతో బీజేపీ నేతలు కొత్త డ్రామాలకు తెరదీశారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో జనాన్ని దోచుకున్నారని .. దానిపై బీజేపీ ఎందుకు ఛార్జీషీట్ వేయలేదని ఆయన ప్రశ్నించారు.
ALso Read: రజనీకాంత్ మరింత దిగజారిపోయారు.. పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్: కొడాలి నాని
అంతకుముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ సినిమాల్లో సూపర్‌స్టార్ అని.. రాజకీయాల్లో మాత్రం అవగాహన లేని వ్యక్తని దుయ్యబట్టారు. సొంతంగా గెలిచే సత్తా లేకే.. చంద్రబాబు రజనీకాంత్‌ను తెచ్చారని వెల్లంపల్లి ఆరోపించారు . ఎంతమంది రజనీలు వచ్చినా ప్రజలు నమ్మరని.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయాలపై రజనీకాంత్‌కు అవగాహన లేదని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీ కూడా చంద్రబాబుతో చేతులు కలిపారన్న విషయం అందరికీ తెలుసునని వెల్లంపల్లి పేర్కొన్నారు.
ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు ఆర్పించడం విడ్డూరంగా వుందన్నారు. కేసీఆర్ కట్టినట్లు చంద్రబాబు శాశ్వత సచివాలయాన్ని ఎందుకు కట్టలేకపోయారని వెల్లంపల్లి ప్రశ్నించారు. రజనీకాంత్ ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని.. వెల్లంపల్లి చురకలంటించారు. సినిమా యాక్టర్లు చంద్రబాబు స్క్రిప్ట్ చదివి వెళ్తారని.. జనానికి మాత్రం అసలు విషయాలు తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. ఇక గతంలో ప్రధాని నరేంద్ర మోడీని తిట్టి.. నేడు ప్రశంసిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
