కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్ కావడానికి జీవీఎల్ కారణమంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారని భరత్ గుర్తుచేశారు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై (gvl narasimha rao) వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విరుచుకుపడ్డారు. తెలుగువారై ఉండి బీజెపీ ఎంపి జీవీఎల్ (margani bharat) ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్ కావడానికి జీవీఎల్ కారణమంటూ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారని భరత్ గుర్తుచేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై 22 మంది వైసిపి ఎంపిలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని భరత్ తెలిపారు. 

వైసిపి ఎంపి లు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ (narendra modi) ఆంధ్రాకు అన్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అని చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారని భరత్ దుయ్యబట్టారు. ఏ మొఖం పెట్టుకుని టిడిపి మహిళలు దీక్షలు చేస్తున్నారని.. పోలవరం ప్రాజెక్టుకు (polavaram project) కేంద్రం 2,100 కోట్లు రీఎంబర్స్ చెయ్యాల్సి ఉందని ఆయన తెలిపారు. ఎపిలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన .. ఆ క్రెడిట్ తమకు అక్కర్లేదన్నారు. 

కాగా.. ప్రత్యేక హోదా(Special Status) మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ నెల 17వ తేదీన ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే, ఈ కమిటీ ఎజెండా నుంచి ఉన్నట్టుండి ప్రత్యేక హోదా అంశంపై చర్చను పక్కకు నెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షం మధ్య వాదోపవాదాలు వేడిగా జరుగుతున్నాయి. ఇదే తరుణంలో బీజేపీ(BJP) రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రెట్లు అధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నదని వివరించారు. అదే సందర్భంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులను ఇవ్వడానికి సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వెనుకడుగు వేసిందని ఆయన ఆరోపించారు. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంతా సిద్ధం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా ఖర్చుపెట్టిందని అన్నారు. ఏడు ఏళ్లలో రూ. 35వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని వివరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. 

2014-15లో రాష్ట్రానికి కేంద్రం నుంచి 24వేల 500 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు 77,500 కోట్లు వచ్చాయని అన్నారు. ఇందులో పన్నుల వాటా మూడో వంతేనని పేర్కొన్నారు. మిగితా నిధులు అన్నీ గ్రాంట్ల రూపంలోనే అందాయని తెలిపారు. ఈ నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రస్తావించిందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా తమ నిధులుగా ప్రచారం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం అవసరం లేదని, కేవలం వారికి ఆర్భాటాలు, ప్రచారం కావాలని, స్టిక్కర్లు వేసుకోవడం కావాలని విమర్శించారు.