న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ పై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని కోరినట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ విషయాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్రంతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఉండేందుకు గాను చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. అంతర్వేదిలో రథం కాలిందని రాష్ట్రాన్ని కాల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మత కలహాలను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

రైలు తగులబెట్టి కాపులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీపై విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ సంజీవ్ మండిపడ్డారు. 

నీతి నిజాయితీ ఉంటే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. హద్దుమీరి మాట్లాడితే రఘురామకృష్ణంరాజు బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు.