కర్నూల్: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామంలో వైఎస్ఆర్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ గ్రామ సర్పంచ్ పదవిని టీడీపీ దక్కించుకొంది.

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ స్థానం నుండి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. అంతకుముందు ఆయన పోలీస్ అధికారి. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్‌సీపీలో చేరి ఎంపీగా విజయం సాధించాడు.

మాధవ్ స్వగ్రామం కర్నూల్ జిల్లా రుద్రవరం గ్రామం. ఉద్యోగ నిర్వహణ నిమిత్తం ఆయన అనంతపురం జిల్లాలో పనిచేశాడు. కర్నూల్ జిల్లా రుద్రవరం గ్రామ సర్పంచ్ పదవికి టీడీపీ అభ్యర్ధి ఎంకే మధు పోటీ పడ్డాడు.

మధుకు మాధవ్ సమీప బంధువు.  మధుకు మాధవ్ మద్దతు ప్రకటించారని ప్రచారం సాగుతోంది. పార్టీని సంప్రదించకుండానే బంధువుకు గోరంట్ల మాధవ్ మద్దతివ్వడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని రుద్రవరం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు భావిస్తున్నారు.