లేజిస్లేటివ్ చరిత్రలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు గతంలో జరిగి వుండవన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఇదే విధంగా కిందటి సెషన్‌లో చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని కౌన్సిల్ ఛైర్మన్‌కు ఆదేశాలిస్తూ.. బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపేలా చేశారని అన్నారు.

గతంలో ఎన్నడూ కూడా మాజీ ముఖ్యమంత్రులు గ్యాలరీలోకి వచ్చి కూర్చొన్న దాఖలాలు లేవని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ రోజు కౌన్సిల్ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధమన్నారు.

Also Read:మంత్రి వెల్లంపల్లిపై టిడిపి ఎమ్మెల్సీల దాడి... లోకేష్ పై మంత్రుల ఫిర్యాదు

సాయంత్రం 8.30 గంటల వరకు మండలిని వాయిదా వేసుకుంటూ వచ్చి... చివరికి తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించారని ఉమ్మారెడ్డి గుర్తుచేశారు.

అచ్చం ఇవాళ కూడా అదే విధానాన్ని పాటించారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. టీడీపీ చెప్పినట్లుగా సభ సాగాలని చూశారని.. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారని... టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత అంటూ ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్ధిక మంత్రి చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదని, 33 ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయమని ఉమ్మారెడ్డి తెలిపారు.

Also Read:వికేంద్రీకరణ బిల్లుపై రగడ...మండలి డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయానికే మంత్రుల అడ్డు

మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. అప్రాప్రియేషన్ బిల్లు పాస్ చేసుకుందామంటే అడ్డుకున్నారని చెప్పారు. ఉద్యోగులకు జీతాలివ్వాలని మంత్రులు వేడుకున్నా ఛైర్మన్ ఒప్పుకోలేదని మంత్రి అన్నారు.

పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లు పాసవ్వడం టీడీపీకి ఇష్టం లేదని... మంత్రులపై దాడి జరిగిందని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. తెలుగుదేశం నేతలు కండకావరంతో ఉన్నారని... విధ్వంసం చేస్తామని యనమల అంటున్నారని తోలు లాగేస్తామని హెచ్చరించారు.