అమరావతి: కీలకమైన సీఆర్డీఏ రద్దు,వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ఏపీ శాసనమండలి మరోసారి రణరంగంగా మారింది. ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా టిడిపి సభ్యులు అడ్డుకోవడం, ప్రవేశపెట్టడానికి వైసిపి సభ్యులు, మంత్రులు ప్రయత్నించడంతో వివాదం చోటుచేసుకుంది. ఓ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రులు బాహాబాహీకి దిగారు. ఈ గొడవల మధ్య ఏ బిల్లులకు ఆమోదం లభించకుండానే శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. 

సభలో టిడిపి ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర, మంత్రి వెల్లంపల్లి మధ్య గొడవ చోటుచేసుకుంది. వీరి మధ్య పరస్పరం తోపులాట చోటుచేసుకోవడమే కాదు పరస్పరం ముష్టిఘాతాలకు దిగినట్లు సమాచారం. 

read more  వికేంద్రీకరణ బిల్లుపై రగడ...మండలి డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయానికే మంత్రుల అడ్డు

ఈ క్రమంలో మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీలు బీదా రవించంద్రా, మంతెన సత్యనారాయణరాజులు మంత్రిపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మెడ పట్టుకు తోస్తూ దాడికి పాల్పడ్డాడట. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు కూడా మంత్రిపై దాడికి పాల్పడగా దీన్ని గమనించిన మరో 
మంత్రి గౌతమ్ రెడ్డి ఆయనను కాపాడి పక్కకు తీసుకువచ్చాడని సమాచారం.

ఇలా మండలిలో రభస కొనసాగుతున్న సమయంలో టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సెల్ ఫోన్‌తో ఫొటోలు తీసినట్లు మంత్రులు, వైసిపి ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. సభా నియమాలకు విరుద్దంగా వ్యవహరించారంటూ లోకేశ్‌పై చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫొటోలు తీయవద్దన్న మండలి డిప్యూటీ చైర్మన్ హెచ్చరించారు.  ఈ గొడవల మధ్య కీలక బిల్లులు ఆమోదించకుండానే మండలి నిరవధికంగా వాయిదా పడింది.