సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. గత అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. 

YSRCP MLC Uday Bhaskar former driver subramanyam death case postmortem completed

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. గత అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసులు ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చినట్టుగా వెల్లడించారు. 

తొలుత మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించామని.. ఆ మేరకు సెక్షన్ 302 కిందకు మారుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా పెడతామన్నారు. కేసు నమోదయ్యాక పోస్టుమార్టం చేసిన తర్వాతే.. దాని నివేదిక ప్రకారం కేసులో సెక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. 

ఎస్పీ ప్రకటన తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం సుబ్రహ్మణ్యం స్వగ్రామం పెదపూడి మండలం జి మామిడాడకు తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక, బాధిత కుటుంబాన్ని అదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ చెప్పారు. 

ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసనకు దిగారు. సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మరోవైపు శనివారం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అపర్ణ శనివారం పగలు కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. చివరకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను సాయంత్రం పోలీసులు కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం శవ పంచనామా నిర్వహించారు. అయినప్పటికీ పోస్టుమార్టమ్ అంగీకారపత్రంపై సంతకాలు చేసేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక, రాత్రి 11 గంటల సమయంలో ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రకటించడంతో కుటుంబ సభ్యులు పోస్టుమార్టమ్‌కు అంగీకరించారు. 

ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌పై ఆరోపణలు.. తొలుత పట్టించుకోని పోలీసులు.. 
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వద్ద సుబ్రహ్మణ్యం ఐదేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా మానేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఉదయభాస్కర్.. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో నూకమమ్మ గుడి సమీపంలోని అతని తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో.. మృతదేహాం ఉన్న కారు అక్కడే వదిలేసి మరో వాహనంలో వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యం తల్లి వీధి రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అయితే ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ఈ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మాత్రం.. ఇది హత్యనేనని చెబుతూ వస్తున్నారు. తొలుత కుటుంబ సభ్యుల ఆరోపణలను పోలీసులు పట్టించుకోలేదు. ఉదయభాస్కర్‌ను పోలీసులు కనీసం ప్రశ్నించలేదు. దీంతో ఉదయభాస్కర్ పెళ్లిళ్లను కూడా హాజరయ్యారు. అంతేకాకుండా పోస్టుమార్టమ్ విషయంలో కూడా పోలీసులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేయడం వివాదస్పదంగా మారింది. అయితే పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో.. ఉదయభాస్కర్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios