కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.  ముద్రగడ పద్మనాభం గురించి ఇప్పుడున్న యువతకు తెలియదని త్రిమూర్తులు తెలిపారు. 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు ఉద్యమంలో ముద్రగడ ఏ రోజు రాజకీయ లబ్ధి పొందలేదన్నారు. కాపు ఉద్యమాన్ని కొందరు స్వార్ధానికి వాడుకున్నారంటూ కాకినాడలో పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ముద్రగడ , ఆయన తండ్రి శాసనసభ్యులుగా పనిచేశారని తోట త్రిమూర్తులు గుర్తుచేశారు. కాపు రిజర్వేషన్‌ను 1994లో ప్రారంభించిన ముద్రగడ.. నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదన్నారు. ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకోవడం వల్ల ముద్రగడ నష్టపోయారా, లాభం పొందారా అనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. 

Also Read: చంద్రబాబుకు చిరు సపోర్ట్ చేయనన్నాడు.. నువ్వేమో ఇలా, మీ జాతి సీఎం అవ్వొద్దా : పవన్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు

కాపు ఉద్యమానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం సహాయం చేసిందని ముద్రగడ తెలిపారని త్రిమూర్తులు పేర్కొన్నారు. ద్వారంపూడి కుటుంబంతో ముద్రగడకు వ్యక్తిగత సంబంధాలు వున్నాయని ఆయన చెప్పారు. ముద్రగడ పద్మనాభం గురించి ఇప్పుడున్న యువతకు తెలియదని త్రిమూర్తులు తెలిపారు. కానీ విషయం తెలియకుండా యువత రోడ్డున పడొద్దన్నారు. ముద్రగడను సోషల్ మీడియాతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు యువత ఈ విధంగా వ్యవహరించడం సరికాదని త్రిమూర్తులు స్పష్టం చేశారు.