Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు చిరు సపోర్ట్ చేయనన్నాడు.. నువ్వేమో ఇలా, మీ జాతి సీఎం అవ్వొద్దా : పవన్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ. మీ అన్నయ్య చిరంజీవి చంద్రబాబుకు సపోర్ట్ చేయనన్నారని.. నువ్వేమో చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నావంటూ మండిపడ్డారు. 
 

ap film development corporation chairman posani krishna murali serious comments on janasena chief pawan kalyan ksp
Author
First Published Jun 23, 2023, 4:48 PM IST

చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ తిడుతున్నారని ఆరోపించారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని పోసాని ప్రశంసించారు. ముద్రగడ గొప్పతనం .. పవన్, చంద్రబాబులకు తెలియదన్నారు. కాపుల కోసం ముద్రగడ తన ఆస్తిని, పదవులను కోల్పోయారని పోసాని గుర్తుచేశారు. ముద్రగడ ఏ రోజు రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ధి పొందలేదన్నారు. ముద్రగడ ఏనాడైనా పైసా లంచం తీసుకున్నట్లు గానీ, తప్పు చేసినట్లు గానీ పవన్ నిరూపిస్తే తాను ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతానని పోసాని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యారని పోసాని ఆరోపించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాపుల కోసం ముద్రగడ పద్మనాభం మంత్రి పదవికి రాజీనామా చేశారని పోసాని గుర్తుచేశారు. ముద్రగడ గొప్పవాడా.. పవన్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడో గ్రహించాలన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని పవన్ కళ్యాణే తిట్టాడని.. ఆ నోటితోనే ఇప్పుడు ఆయన్ను సీఎంను చేయాలని అంటున్నావని పోసాని దుయ్యబట్టారు. కాపులను హింసించిన చంద్రబాబుకు మద్ధతు తెలుపుతావా అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులని పవన్ కళ్యాణ్ తిట్టాడని పోసాని ఎద్దేవా చేశారు. ముద్రగడలో అవినీతి, అసూయ లాంటివి లేవని.. ఆయనకు క్షమాపణ చెబితే తప్పేం కాదన్నారు. 

చంద్రబాబు మాయలో పవన్ కల్యాణ్ పడిపోయారని పోసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎవరికంటే గొప్పో పవన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు విలువ తెలిసినవాడు చంద్రబాబుకు ఓటు వేయరని, రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషం పనికిరాదని పోసాని చురకలంటించారు. పవన్ ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నాడో కాపులు అర్ధం చేసుకోవాలని పోసాని సూచించారు. కాపులు సీఎం కావాలని కోరుకోవాల్సిన పవన్ కల్యాణ్.. కమ్మ సీఎం కావాలని కోరుకుంటున్నాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన వర్గం వారిని ఒక్క మాట అనడని.. పవన్ కల్యాణ్ మాత్రం కాపులను తిడుతున్నాడని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జాతిలో పవన్ అవమానించబడుతున్నావని కృష్ణమురళీ వ్యాఖ్యానించారు. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రామోజీరావు ఆయనను పిలిపించారని పోసాని తెలిపారు. చంద్రబాబుకు మద్దతు తెలపాలని, ఈసారికి ఆయన సీఎం అయితే తర్వాత నువ్వు అవుదువుగాని అని అన్నారని కృష్ణమురళీ తెలిపారు. కానీ చిరంజీవి మాత్రం ఓడిపోయినా పర్లేదు కానీ.. చంద్రబాబుకు సపోర్ట్ చేయనని తేల్చిచెప్పారని, ఆయనకు సెల్యూట్ చేయాలన్నారు. చిరంజీవి పంథా నచ్చి పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశానని పోసాని కృష్ణ మురళీ వెల్లడించారు. ఆ సమయంలో కాపులపై, చిరంజీవిపై దుష్ప్రచారం నడిచిందని.. కాపులపై రౌడీ ముద్ర వేసి వాళ్లు గెలిస్తే కమ్మోళ్లని బతకనివ్వరని ప్రచారం చేశారని ఆరోపించారు. సినిమా ఆర్టిస్ట్ కావడం వల్లే పవన్ సభలకు జనం వస్తున్నారని.. అంతకుమించి మరేం లేదని పోసాని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios