విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అభివృద్ధి చూసి వచ్చారు అంటావ్‌, మరి తెలంగాణలో పార్టీ మారితే నీతి బాహ్యమా అంటూ కడిగిపారేశారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదని చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని తెలిపారు. చంద్రబాబు మాటలు విని ఓటేసే వారే ఉండరన్నారు. 

చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రివాడని చిత్తూరు జిల్లా ప్రజలు అనుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చంద్రబాబుకి అందరూ బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. 

ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు రాజ్యాంగ పదవికి మచ్చ తెచ్చారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్‌ దాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌ కళ్యాణ్‌కి లేదన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నపుడు పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.

సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీకి రారు, హిందూపూరంకి వెళ్లరు కానీ తెలంగాణాలో ప్రచారానికి మాత్రం వెళ్తున్నారని విమర్శించారు. మీబావ వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, వారిని మంత్రుల్ని చేసినపుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని ప్రశ్నించారు. 

టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని  రోజా బాలయ్యను నిలదీశారు. నందమూరి సుహాసినిని కూడా కరివేపాకులా వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానం కట్టబెట్టి ఆమెని బలిపశువుని చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.

హరికృష్ణని మానసికంగా చంపేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. హరికృష్ణ కుటుంబంపై ప్రేమ ఉంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా కళ్యాణ్‌ రామ్‌లలో ఒకరికి నీ కుమారుడు లోకేష్‌ మాదిరిగా డైరెక్ట్‌గా ఎమ్మెల్సీ కేటాయించి మంత్రిని చేసినట్లు చేయోచ్చుగా అంటూ ప్రశ్నించారు. 

నందమూరి కుటుంబం ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవుపలికారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే ఇప్పుడు మీ నెత్తికెక్కి కూర్చున్నాడు అని కేసీఆర్‌ కు గుర్తు చేశారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని ప్రజలను రోజా విజ్ఞప్తి చేశారు.