ఏపీలో కరోనా కేసులపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ 19 కేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు.

పొరుగు రాష్ట్రాల్లో కరోనా నిర్థారణా పరీక్షలు చేయడం  లేదని... పాజిటివ్ కేసులు నమోదైనా వారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి తరిమేస్తున్నారని రోజా ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న వారి వల్లే ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read:ఇదే తొలిసారి: ఏపీలో ఒక్క రోజులో 304 కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి

ఇదే సమమంలో గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే అడ్డుకోవాలని రోజా సూచించారు. సోమవారం చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టింగ్ కియోస్క్‌ను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఏపీలో కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పకుండా.. పొరుగు రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేయడం కాదని కొందరు విమర్శిస్తున్నారు.

కాగా ఏపీలో గత 24 గంటల్లో 304 కరోనా కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,456కి చేరుకుంది. ఇవాళ కరోనా కారణంగా ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 86కి చేరింది.