అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కోవిడ్ -19 ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో 304 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు.  దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,456కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ వ్యాధి సోకినవారిలో 246 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 52 మంది ఉన్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 86కు చేరుకుంది. ఒక్కరు కర్నూలు జిల్లాలో మరణించగా, మరొొకరు అనంతపురం జిల్లాలో మరణించారు. 

రాష్ట్రంలో నమోదైన మొత్తం 5087 పాజిటివ్ కేసుల్లో 2770 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 2231 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 210 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకగా యాక్టివ్ కేసులు 187 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారిలో 159 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకగా, ఈ రోజు 22 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 567 ఉంది.