విజయవాడ: ఏపీ ఫైబర్ గ్రిడ్‌ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా చెప్పారు.

సోమవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు శాఖలోని ఫైల్ పై లోకేష్ ఎలా సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు.  ఫైబర్ గ్రిడ్ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్ లు భారీ కుంభకోణం చేశారన్నారు. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.చంద్రబాబుకి ఏటీఎం అని ప్రధాని మోడీనే చెప్పారని ఆమె గుర్తు చేశారు.జగన్ పలుమార్లు తిరుమలకు వెళ్లారన్నారు.ఇవాళ కొత్తగా డిక్లరేషన్ అని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. గతంలో మోడీతో కలిసి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారని ఆమె గుర్తు చేశారు. 

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో 40 గుళ్లను కూలగొట్టారన్నారు. బూట్లతో పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆమె విమర్శించారు. జగన్ అన్ని కులాలు, మతాలకు అతీతమైన నాయకుడని ఆమె చెప్పారు. ఈ కారణంగానే ఏపీలో వైసీపీకి 151 సీట్లు దక్కాయన్నారు.