ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. మళ్లీ ఒంటరిగా జగన్‌ను ఎదుర్కొని.. వీర మరణం పొందలేనని పవన్ నిజం ఒప్పుకున్నాడని ఆయన చురకలంటించారు. 

పవన్ కళ్యాణ్‌వి బిల్డప్ బాబాయ్ మాటలని.. పవన్‌కి సినిమా భాష మాత్రమే తెలుసునని పేర్ని నాని దుయ్యబట్టారు. మళ్లీ ఒంటరిగా జగన్‌ను ఎదుర్కొని.. వీర మరణం పొందలేనని పవన్ నిజం ఒప్పుకున్నాడని ఆయన చురకలంటించారు. మూడు, నాలుగు వేల మంది వున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంని, మంత్రులను కుసంస్కారంతో మాట్లాడటం మినహా ఇంకేమైనా వుందా అని పేర్ని నాని ప్రశ్నించారు. నట్టేట ముంచేస్తారు అని అంతమందిని అనటం దగా కాదా అని ఆయన నిలదీశారు. జగన్ అంటే పవన్‌కు ద్వేషం , అసూయ అని పేర్నినాని పేర్కొన్నారు. ఇంతకంటే దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా వుందా అని ఆయన ప్రశ్నించారు. మాది నియంత ప్రభుత్వం అయితే నీ మీటింగ్‌కు పర్మిషన్ వస్తుందా అని పేర్నినాని నిలదీశారు. 

దేశంలో పవన్ ఒక్కడే బరితెగింపు రాజకీయం చేస్తున్నాడని ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఉద్దానాన్ని ఉద్ధరిస్తా అన్నావ్, ఇన్నాళ్లు ఏం చేశావ్ అంటూ పేర్నినాని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమాకు టికెట్ రేట్ పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చేదా అని ఆయన నిలదీశారు. తిరుమల గదుల అద్దె గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సామాన్యులు తీసుకునే రూమ్స్ రెంట్ పెరగలేదని పేర్నినాని స్పష్టం చేశారు. కేవలం వీఐపీలకు కేటాయించే గదుల అద్దె మాత్రమే పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Also Read: మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి.. నేను భయపడాలా : జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

పవన్, బాబు ఏం మాట్లాడుకున్నారో చెప్పడానికి ఇంటెలిజెన్స్ అవసరమా అని పేర్ని నాని ప్రశ్నించారు. అంబటి, అమర్‌నాథ్, హోంమంత్రి గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. మధ్యలో టీ వస్తే పావు గంట గ్యాప్ ఇచ్చారని.. పవన్ ఏ రోటికాడ ఆ పాడ పాడుతున్నారని పేర్నినాని దుయ్యబట్టారు. పగవాడికి కూడా పవన్ కల్యాణ్ బాధ వద్దంటూ ఆయన సెటైర్లు వేశారు. భయం లేనప్పుడు 13 సార్లు చెప్పుకోవడం ఎందుకని పేర్నినాని ప్రశ్నించారు. కాపుల్ని పవన్ తప్ప అందరూ బాగానే చూసుకుంటున్నారని.. మమ్మల్ని తిడితే నీ నోటి తీట తీరుతుందేమో కానీ, మాకు వెంట్రుకంత నష్టం లేదని ఆయన తెలిపారు.