గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ది  జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడిగినా లక్ష రూపాయలతో కల్వర్ట్ నిర్మాణం చేయలేదన్నారు. తాను అధికారపార్టీలో లేనా? అని ప్రశ్నించారు. తాను రికమండ్ చేస్తే పనులు చేయరా? అని ప్రశ్నించారు. కార్పొరేషన్ పనులు తనకు సమాచారం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎమ్మెల్యేనని.. పది సంవత్సరాలుగా ఉన్నానని.. ఏదైనా పని చేసే ముందు తెలపాలని వేడుకున్నారు. రెండు చేతులతో జోడించి కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్థానిక మానససరోవరం పార్క్ బాగు చేయమని పదే పదే అడుగుతున్నప్పటికీ.. అధికారులు గానీ, నగర మేయర్ గానీ పట్టించుకోవడం లేదని అన్నారు. గుంటూరు నగరంలో ప్రజల వద్దకు వెళితే.. వారు చెబుతున్న మాటలు వింటే కళ్లకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. రేపు ఎన్నికల్లో తమ పార్టీ గెలవాలని.. అందుకు ప్రజలను ఓట్లు అడుక్కోవాలని.. అందుకే అభివృద్ది పనుల గురించి ఇక్కడ అడుక్కుంటున్నానని అన్నారు. తాము చెప్పిన పనులు చేయాలని కోరారు. 

అయితే కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ముస్తాఫా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ది జరగడం లేదన్నదే తన ఆవేదన అని.. నియోజకవర్గంలో అభివృద్ది కోసం నిధులు అడగటం తప్పా? అని ప్రశ్నించారు. తన మీద ఎందుకు కక్ష గట్టారో అర్థం కావడం లేదని అన్నారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. లక్ష రూపాయల పని చేయించకపోతే ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలోకి వెళితే పనులు జరుగడంలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. పనులు చేస్తేనే ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగగలుగుతామని అన్నారు. గతంలో రూ. 25 కోట్లు ఇస్తామన్న పార్టీ మారలేదని తెలిపారు. తాను పార్టీ మారుతున్నానని .జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని.. తన కూతురును ముందుకు తీసుకొస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు.