ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీకి బినామి పార్టీగా జనసేన వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంగ్లీషు మీడియంపై అవగాహన లేని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్లు చేససుకోవాలని ప్రజలను ఉసిగొల్పుతున్నారా అంటూ విరుచుకుపడ్డారు. 

తాడేపల్లి గూడెంలో మీడియాతో మాట్లాడిన కొట్టు సత్యనారాయణ వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటే రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరే అసహనంతో ఉన్నారని మండిపడ్డారు. అది కూడా అధికారం కోల్పోయామన్న అక్కసుతోనేనంటూ ధ్వజమెత్తారు. గత అయిదేళ్లలో టీడీపీ చేసిన అవినీతి పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా అని నిలదీశారు. 

తెలుగుదేశం పార్టీని రక్షించడం కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారే తప్ప కార్మికుల కోసం కాదని మండిపడ్డారు. రూ. 200 కోట్ల రూపాయిల కార్మికుల నిధిని స్వాహా చేసిన ఆనాటి  మంత్రి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకున్న పవన్‌ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటున్నారని ధ్వజమెత్తారు. 

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించే వ్యక్తులకు అసలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పడే అవస్థలు తెలుసా అని నిలదీశారు. పోటీ పరీక్షలకు తెలుగు విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదన్నారు. 

కాయకష్టం చేసుకొనే కార్మికులు సైతం తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే తాపత్రయపడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల వారిని చదివించుకోలేని దుస్థితి అని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై మండిపడ్డారు. పోస్టులు చట్ట పరిధిలోకి లోబడి లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. 

పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్లు పులి పడుకుంది కదా అని పక్కన నుంచోని ఫోటో తీయడానికి ప్రయత్నించకండి. ఎన్ని చెప్పినా, ఏం అన్నా సీఎం వైఎస్‌ జగన్‌ ఊరుకుంటారులే అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం పవన్ నాయుడు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు

దోస్త్ మేరా దోస్త్: చంద్రబాబు దీక్షకు పవన్ మద్దతు, దీక్షకు జనసైనికులు