విజయవాడ: ఈనెల 14న విజయవాడలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబాబు నాయుడు చేపట్టనున్న దీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించారు. 

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నివారించడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడ్డ భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గురువారం 12 గంటలపాటు దీక్షకు దిగనున్నారు. 

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టుతుంది. అందులో భాగంగా  జనసేన పార్టీ మద్దతు కోరింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. 

చంద్రబాబు నాయుడు దీక్షపై వివరించారు. చంద్రబాబు చేపట్టనున్న ఇసుక దీక్షకు మద్దతు పలకాలంటూ కోరారు. ఇసుక కొరతపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఇసుక కొరతకి సంబంధించి ఎవరు నిరసన తెలిపినా జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు మాజీమంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇసుక దీక్షకు మద్దతు ప్రకటించినందుకు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుక కొరత, తెలుగుమీడియంలపై ప్రభుత్వ తప్పుల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తే వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.  

పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టి పలు సూచనలు చేస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. పవన్ ప్రెస్మీట్ పెడితే వెంటనే ఒక మంత్రి ఒంటికాలు మీద లేచాడంటూ విమర్శించారు.  

మాకు నోరు ఉంది మేము మాట్లాడగలము అనే తరహాలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మాత్రం సమస్య పరిష్కారం కావడమే ముఖ్యమని తెలిపారు. అందుకోసం ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. 

ఇకపోతే చంద్రబాబు ఇసుక దీక్షకు పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఇప్పటి వరకు 
అన్ని పార్టీలు మద్దత్తు తెలిపాయని అయితే గురువారం దీక్షలో ఎవరెవరు పాల్గొంటారో వేచి చూడాలన్నారు.  

ఇసుక కొరతవల్ల రాష్ట్రంలో ఇప్పటికే 45 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కళ్లు తెరవడం లేదన్నారు. ఇసుక కొరత వలన ఎంతమంది చనిపోతే మీరు స్పందిస్తారో చెప్పండంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

గతంలో ఇసుక ఎలా ఉచితంగా ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా ఉచితంగా ఇవ్వాలని నిలదీశారు. ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికే ఈ ఇసుక దీక్ష చేస్తున్నామని వర్ల రామయ్య స్పష్టం చేశారు.  

ఇకపోతే టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. మాజీ సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని కన్నా హామీ ఇచ్చారు.  

ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపీనే అని ఆలపాటి రాజాకు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌కు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు పొత్తు పెట్టుకుని నష్టపోయామన్నారు. భవిష్యత్‌లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇకపోతే ఇసుక కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వాస్తవమన్నారు. అందువల్ల ఏ పార్టీ అయినా సరే ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడితే తమ సంఘీభావం ఉంటుందే తప్ప పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు కన్నా లక్ష్మీనారాయణ.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేతల భేటీ: బాబు దీక్షకు మద్దతుపై చర్చ

టీడీపీ ఖాళీ కావడం ఖాయం:సోము వీర్రాజు సంచలనం