దేశంలోని ఏ మూలకు వెళ్లినా వారు అక్కడి ప్రజలు వారి భాషను సంరక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై పవన్ మరోసారి ఘాటుగా స్పందించారు.

ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన పరిస్థితుల్లో ఇంగ్లీష్ అత్యవసరమే కానీ.. సంస్కృతి మూలాలను, భాషను చంపుకోవడం సరికాదన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి.. తెలుగు శిలాఫలకాలు దొరికిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తెలుగు భాష ఉనికిని కాపాడాలని సూచించారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుల్నే జగన్ సైతం ఫాలో అవుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. అన్ని సరిదిద్దుతున్నామని అనుకున్నప్పుడు తెలుగుభాష విషయంలో మాత్రం ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని జనసేన నిలదీశారు.

Also Read:జగన్‌కు నీలాగా పెళ్ళిళ్లపై మోజు లేదు: పవన్‌కు పేర్ని నాని కౌంటర్

తాను తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నానని... ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగా ఉంటే తెలుగు మీడియంలో చదువుకోవడానికి పిల్లలు ఇష్టపడరని పవన్ ప్రశ్నించారు. తమిళ భాషను చిన్న మాటంటే రాజకీయ పరమైన విభేదాలు సైతం పక్కనబెట్టి తమిళనాడు మొత్తం ఏకమైందని జనసేనాని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం వల్ల మన రాజకీయ నాయకులకు తెలుగు భాష, సంస్కృతి పట్ల ప్రేమ లేదని పవన్ ఎద్దేవా చేశారు. మా భాషను, యాసను, సంస్కృతిని అవమానపరిచారని తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా మారిందని ఆయన గుర్తుచేశారు.

తెలుగు భాష, సంస్కృతి, ఉనికిని చంపేందుకు ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారని పవన్ కల్యాణ్ దుమ్మెత్తిపోయారు. హిందీని అన్ని రాష్ట్రాల్లోనూ మొదటి భాషగా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నాలు చేస్తే తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఎదురు తిరిగారని జనసేనాని గుర్తు చేశారు.

Also Read:నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో.. ఎవడొద్దన్నాడు: జగన్‌కు పవన్ కౌంటర్

నిఘంటువులు ప్రచురించడానికి సైతం ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని పవన్ ప్రశ్నించారు. తెలుగు పేపర్ నడుపుకునే మీరు తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. తెలుగు మీడియం చదివే విద్యార్ధి వూరికి ఒక్కరు ఉన్నప్పటికీ దానిని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. 

మంగళవారం సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కావాలనుకుంటే సీఎం కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చునని ఇందుకు ఎవరు అభ్యంతరం చెప్పరని ఘాటుగా బదులిచ్చారు.మేమంటే భయపడుతున్నారు కాబట్టే సీఎం స్థాయి వ్యక్తి అంతఘాటుగా స్పందిస్తున్నారని జనసేనాని అభిప్రాయపడ్డారు.