అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసెంబ్లీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు ఆయన తిరిగి వింటే ఆయనకే అసహ్యం వేస్తోందని చెప్పుకొచ్చారు. 

స్పీకర్ గా ఎన్నికైన సమయంలో స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాకుండా అచ్చెన్నాయుడును పంపడంపై తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అనంతరం తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు మహిళలు తనను తిడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 

యూజ్ లెస్ ఫెలో నీకేమైనా బుద్ధి ఉందా అసెంబ్లీలో అచ్చెన్నాయుడులా మాట్లాడుతున్నావ్ అంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో అలా మాట్లాడతారా అంటూ తిడుతున్నారని చెప్పుకొచ్చారు.  

గత ఐదు సంవత్సరాలలో దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సభను నడిపారని విమర్శించారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు ఎంతలా మాట్లాడారో ప్రజలంతా చూశారని గుర్తు చేశారు. ఆనాడు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు తానేదో పతివ్రతలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

సభలో అచ్చెన్నాయుడు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆ విషయం ఆయన తెలుసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లు సభను ఎలా నడిపించారో గుర్తుకు తెచ్చుకుని తాము ఎలా నడుపుతున్నామో పరిశీలిస్తే అంతా అర్ధమవుతుందంటూ అచ్చెన్నాయుడుకు సూచించారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.