100 తప్పులు చేశారు.. ఇక చంద్రబాబుకు శిరచ్ఛేదమేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబు నిప్పో.. స్కామ్‌ల తుప్పో త్వరలోనే తేలిపోతుందని రాంబాబు చెప్పారు. నీతి నిజాయితీల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్.. ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని అంబటి నిలదీశారు.

గత ఐదు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ దాడులను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు రాంబాబు. చంద్రబాబుకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ ఇంట్లో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా సోదాలు జరిగాయని.. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిపై దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని అంబటి ప్రశ్నించారు.

ప్రతి విషయంపైనా ప్రెస్‌మీట్లు పెట్టే చంద్రబాబు.. తన వ్యక్తిగత కార్యదర్శిపై దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన నిలదీశారు. తర్వాత చంద్రబాబు మీదకు ఇది రాబోతోందని అంబటి వ్యాఖ్యానించారు.

Also Read:అమ్మ చంద్రబాబు.. : ఐటీ దాడులపై బొత్స వ్యాఖ్యలు

శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సోదాల్లో రెండు వేల కోట్ల రూపాయలు అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభించాయని ఐటీ శాఖ ప్రకటించిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు. మూడు ఇన్‌ఫ్రా కంపెనీలు పనులను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా చిన్న కంపెనీలకు.. అక్కడి నుంచి విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని రాంబాబు ఆరోపించారు.

ఐటీ, ఈడీలు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. పైగా కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు ఘీంకారాలు పలికారని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు, లోకేశ్‌లు హైదరాబాద్‌లో తలదాచుకున్నారని.. బాబు అవినీతిపరుడని ఈ మాట స్వయంగా ఎన్టీఆర్ చెప్పారని రాంబాబు చెప్పారు.

భారత రాజకీయాల్లో ధన ప్రవాహన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అక్రమార్జనలకు సంబంధించిన లెక్కలు చూసుకోవడానికే చంద్రబాబు తరచూ దావోస్ వెళ్లేవారని రాంబాబు ఆరోపించారు.

Also Read:మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల

చంద్రబాబు పాపం పండిందని, ఇందుకు ప్రతిఫలం అనుభవించి తీరాలన్నారు. చంద్రబాబు పీఎస్‌ను పట్టుకుంటేనే రెండు వేల కోట్ల రూపాయలు దొరికాయని.. అలాంటిది బాబును, లోకేశ్‌ను పట్టుకుని విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయోనని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని.. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు సులభంగా బయటపడతారని అన్నారు. 26 కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని.. ప్రస్తుతం కూడా హైదరాబాద్‌లో ఏదో గూడుపుటాని చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు.

అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేసి కస్టడిలోకి తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మీడియా సైతం చంద్రబాబుకు సంబంధించిన వార్తలు రాయడం లేదని, అదే జగన్ విషయంలోనైతే నానా రాద్దాంతం చేస్తారని ఆయన మీడియాపై ధ్వజమెత్తారు.